telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వైసీపీ అధినేత జగన్ పై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

nagababu1

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసి వరుసగా విమర్శలతో కూడిన వీడియోలను విడుదల చేశారు. ఆ తరువాత చివరగా ఒక వీడియోను విడుదల చేసి ఆ వివాదాన్ని ముగించారు. తరువాత ఇకనుంచి “మై ఛానెల్… అంతా నా ఇష్టం” అనే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా విమర్శలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై విమర్శలు చేశారు. అందులో నారా లోకేష్ చిన్నపిల్లాడు అంటూ ఎద్దేవా చేశారు నాగబాబు.

తాజాగా వైసీపీ అధినేత జగన్ పై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇటీవల ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ప్రస్తావిస్తూ “ఈ మధ్య మన ప్రతిపక్ష ప్రియతమ నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో సెన్సేషనల్ జర్నలిస్ట్ శ్రీ రజినీకాంత్ గారు అడిగిన ప్రశ్నకు ఒక సమాధానమిచ్చారు. అది ఎంత నిజాయితీతో కూడుకున్నదంటే… చూడండి ఆయన తను ఎలా ఉన్నది, ఏం చేస్తున్నదీ, ఏ స్టేజ్ లో ఉన్నదీ చెప్పారు. మీరు కూడా ఒకసారి చూడండి అంటూ జగన్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు.

ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి గురించి ప్రస్తావిస్తూ “బహుశా నా స్టేజ్ కూడా దాటిపోయి, కోర్టు స్టేజ్ కూడా దాటిపోయింది” అన్నారు. ఆ వీడియో తరువాత నాగబాబు కొనసాగిస్తూ ఎవరైనా ఓ వ్యక్తి “వీడు నాకన్నా గొప్పవాడు” అని అన్నాడంటే దానర్థం… అతడు కూడా గొప్పవాడేనని, అతడి కంటే ఇతడు ఇంకా గొప్పవాడని అర్థమని… ఎవరైనా ఒక వ్యక్తి వాడు నాకన్నా వెధవ అన్నాడంటే… దానర్థం ఇతడు పెద్ద వెధవ అని, కానీ ఇతడు కూడా వేదవేనని అన్నారు. ఇదే విషయాన్ని జగన్‌కు ఆపాదిస్తూ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన దాంట్లోనూ ఇదే కనిపిస్తోందని, తనకో స్టేజ్ ఉందని, తనకో స్థాయి ఉందని, తనమీద కొన్ని కేసులు కూడా ఉన్నాయని చెప్పారని నాగబాబు గుర్తుచేశారు. చంద్రబాబు తన రేంజ్‌ను మించిపోయారని అన్నారని, అంటే చంద్రబాబును చూసి జగన్ అసూయ చెందుతున్నట్టేనని అన్నారు.

Related posts