కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని న్యూమహారాజా లాడ్జిలో నిప్పంటించుకుని తల్లి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామాయంపేటకు చెందిన గంగం పద్మ, సంతోష్‌లుగా గుర్తించారు.
అయితే వీరు ఆత్మహత్య పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు.ఆ వీడియోలో తమ ఆత్మహత్యకు స్థానిక రాజకీయ నాయకులతో పాటు కొంతమంది పోలీసు అధికారుల వేధింపులే కారణమని తెలిపాడు.
వివరాల్లోకి వెళ్తే..
పద్మ, సంతోష్ అనే తల్లీకుమారులిద్దరూ ఈ నెల 11న కామారెడ్డిలోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. తల్లి పద్మ వైద్యం కోసం వీరు కామారెడ్డి వచ్చినట్టుగా తెలిసింది. అయితే వారు ఉంటున్న రూమ్‌లోనే నిప్పంటించుకున్నారు. వారి గది నుంచి తెల్లవారుజామన పొగలు రావడం గమనించిన లాడ్జి సిబ్బంది.. పోలీసులకు సమాచారమిచ్చారు.
ఈ క్రమంలోనే మంటలు ఆర్పేందుకు లోపలికి వెళ్లి చూడగా తల్లి, కుమారుడు చనిపోయి ఉన్నారు. దీంతో వాళ్ల సెల్ ఫోన్ పరిశీలించగా అందులో సెల్ఫీ వీడియోతో పాటు ఐదు పేజీల సూసైడ్ నోట్ కూడా బయటపడింది.
ఇందులో సంతోష్ తమ మృతికి కారణమైన వారి పేర్లతో పాటు ఫోటోలను చూపెడుతూ సెల్ఫీ వీడియో తీశాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలిసింది.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.. సంతోష్ పేర్కొన్న వారిలో మొత్తం ఏడుగురి వివరాలను ప్రస్తావించాడు.
గతంలో రామాయంపేటలో పనిచేస్తున్న సీఐ నాగార్జునగౌడ్ సహా మరో ఆరుగురు ఆత్మహత్యకు కారణమంటూ వీడియోలో వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సోమనాధం, పట్టణ సీఐ నరేష్ పరిశీలించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.