కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఒక వీఆర్ఓపై ఫోన్ లో విరుచుకు పడ్డ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. గాజులరామారం సర్వేనెంబర్ 79లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్న సంగతి తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేయాలని వీఆర్వోని పంపారు. పోలీస్ సిబ్బందితో అక్కడికి వెళ్ళిన శ్యామ్ అనే వీఆర్వో అవి అక్రమ కట్టడాలు అని భావించి 15 ఇళ్లను కూల్చివేసి కరెంటు మీటర్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఎలాంటి నోటీసులు లేకుండా అధికారులు తెల్లవారుజామున వచ్చి ఇళ్లను నేలమట్టం చేశారని చెబుతూ బాధిత మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వివేకానందను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వీఆర్ఓకు ఫోన్ చేశారు. ఈ ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో వీఆర్వో మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వివేక్. ‘ఎవరు కూల్చమంటే పేదోళ్ల ఇళ్లు కూల్చావు.. మీటర్లు ఉన్నా ఎందుకు కూల్చావు..? వాటిని నీతో ఎందుకు తీసుకెళ్లావు..? అంటూ వీఆర్ఓ శ్యామ్కుమార్ను తీవ్ర పదజాలంతో దూషించిన ఆడియో బయటకు రావడంతో ఆ ఆడియో వైరల్ గా మారింది. ఇక నేను రమ్మంటే రావా కిందేసి తొక్కుతా అంటూ కాస్త గట్టిగానే వివేక్ ఫైర్ అయ్యారు.

