ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు పులివెందుల వెళ్లనున్నారు. సీఎం మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. గంగిరెడ్డి సంస్మరణ సభను ఆయన కుటుంబ సభ్యులు భాకారాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో సంస్మరణ సభకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై గంగిరెడ్డికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఢిల్లీ బయలు దేరి వెళతారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయనకి అపాయింట్ మెంట్ ఫిక్స్ అయింది.
ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానితో చర్చినున్నారని అంటున్నారు. అయితే ఈ విషయం మీద మీడియాలో రకరకాల కధనాలు వస్తున్నాయి. మోడీనే జగన్ ని పిలిపించుకున్నారని ఒక వర్గం మీడియా అంటుంటే లేదు కేసుల రోజూ వారీ విచారణ భయంతో ఆయనే కలుస్తున్నారని మరో వర్గం మీడియా అంటోంది. తాజాగా ఎన్డీఏ నుండి అకాళీదళ్ పార్టీ బయటకి వెళ్ళిపోయిన క్రమంలో జగన్ ను ఎన్డీఏలోకి మోడీ ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది.