telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మిరాలం ఎస్టీపీ సంద‌ర్శించిన జ‌ల‌మండ‌లి ఎండీ

ఎస్టీపీల నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎండీ దానకిశోర్ అధికారులకు సూచించారు. మిరాలం చెరువు, జలమండలి ఎస్టీపీల ప్రాజెక్టు ప్యాకేజీ – 2 లో భాగంగా అక్క‌డ నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఆయన హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖల అధికారులతో కలిసి సోమ‌వారం సందర్శించారు.

 

ఆయన మాట్లాడుతూ.. మొత్తం 41.5 ఎంఎల్డీల సామర్థ్యంతో ఈ ఎస్టీపీని నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణ పనులు పరిశీలించి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిరాలం చెరువు ప‌రిస‌ర ప్రాంతాల‌ను పరిశీలించారు. చెరువులోకి మురుగు చేర‌కుండా అక్కడున్న పైపు లైన్లను అనుసంధానం చేసి కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీటిని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప‌నులు పూర్తి చేయాలన్నారు. చెరువులోకి మురుగు చేరకుండా చూడాలని సూచించారు. ప‌ని జ‌రిగే ప్ర‌దేశంలో ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. ఎస్టీపీ పనులు తుది దశకు చేరుకున్నందున.. పనుల్లో వేగం పెంచి తొందరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు. ఈ నెలాఖరులోగా ట్రయల్ రన్ పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఈడీ డా.ఎం.స‌త్య నారాయ‌ణ‌, ప్రాజెక్టు డైరెక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్ బాబు, ఎస్టీపీ సీజీఎం సుద‌ర్శ‌న్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
మొత్తం రూ.3,866.41 కోట్ల వ్యయంతో 3 ప్యాకేజీల్లో, 5 సర్కిళ్లలో ఈ 31 ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వ‌స్తే.. న‌గ‌రంలో మురుగు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం లభిస్తుంది. వీటి ద్వారా రోజూ 1282 మిలియ‌న్ లీట‌ర్ల మురుగు నీటిని శుద్ధి చేయ‌వ‌చ్చు.
అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది.

Related posts