telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగార్థులలో నైపుణ్యం కోసమే .. కృషి.. : అవంతి శ్రీనివాసరావు

avanthi srinivas minister ap

రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాసరావు రాష్ట్రప్రభుత్వం నూతనంగా రూపొందించిన యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను సచివాలయంలో బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఎవరైన సలహాలు, సూచనలు వెబ్‌సైట్‌, ట్విట్టర్‌, ఫెస్‌బుక్‌ ద్వారా అందించవచ్చునని మంత్రి వెల్లడించారు. దేశ, రాష్ట్ర జనాభాలో 60 శాతం యువత ఉందని గుర్తు చేశారు. యువతలో నైపుణ్యం, సంస్కృతీ సంప్రదాయాలు, ఉపాధి, శిక్షణలతో పాటు యువజనోత్సవాలను డివిజన్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 18 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగానే శాస్త్రీయ గానం, నృత్వం, సంగీత వాయిద్యం, జానపదం తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించే సమైక్యతా కార్యక్రమాలను 5 రోజుల పాటు నిర్వహించి వారికి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.

డివిజన్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు యువజన పార్లమెంట్‌ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రకృతి వైపరీతాల్య వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనేందుకు ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యువతకు శిక్షణ అందిస్తామని తెలిపారు. యువజన క్లబ్‌లు, సంఘాలను బలోపేతం చేస్తామని వెల్లడించారు. మహిళా శక్తిని అభివృధ్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు పోలీస్‌, న్యాయ, మహిళా సంఘాల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థలో యువతకు తగిన తర్ఫీదునిచ్చి ఉద్యోగ కల్పన శిక్షణా కార్యక్రమాలను వెబ్‌ సైట్‌లో పొందుపరుస్తున్నామని వెల్లడించారు. రక్తదానం, అవయవదానం వంటి కార్యక్రమాల్లో యువతలో చైతన్యం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శి కె ప్రవీణ్‌కుమార్‌, డైరెక్టర్‌ సి నాగరాణి, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండి తదితరులు పాల్గొన్నారు.

Related posts