telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రజాదరణ లేని నాయకులు కాంగ్రెస్ వీడుతున్నారు

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మానిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని.. 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామన్నారు. రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలను తెలుసుకున్నామని.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేస్తానని.. ఈ కసరత్తు పూర్తి కావడానికి మరి కొంత సమయం పడుతుందన్నారు. ఢిల్లీలో దోస్తీ – గల్లీ మే కుస్తీ అన్నట్టుగా కేసియార్ – మోదీ భేటీ, టీఆరెస్ – బీజేపీ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. మరో 6 నెలల పాటు ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని అర్ధమైందని… ఈ భేటీపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చెబుతారో చూడాలన్నారు. ప్రజాదరణ లేని నాయకులు మా పార్టీని వీడుతున్నారని.. అలాంటి వారితో మా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. ప్రజాదరణ కలిగిన బలమైన నేతలు వీడితేనే ప్రమాదమని.. అసలైన కాంగ్రెస్ నేతలెవరూ మా పార్టీని ఎట్టి పరిస్థితిలో వీడరని తెలిపారు. సంస్థాగతమైన లోపాల కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని.. అందుకు బాధ్యత వహిస్తూ జీహెచ్ఎంసీ విభాగం అధ్యక్షుడు రాజీనామా చేశారన్నారు.

Related posts