telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ ఎన్నికల్లో గెలిచేది ఆ ప్యానలే?

మా ఎన్నికలు ఈ సారి ఉత్కఠ భరితంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు , జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కమిటీ ఎన్నికల తేదీని ప్రకటించకుండానే వీరు పోటీలో ఉన్నట్టు మీడియా సమావేశాలు పెట్టి మరీ వెల్లడించారు. ప్రకాష్ రాజ్ తన ప్యానల్ లో 27 మంది సభ్యులను ప్రకటించారు. దీంతో మా ఎన్నికల హంగామా తరచూ వార్తల్లో ప్రాధాన్యత సంతరించుకుంది . సెప్టెంబర్ 12న మా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కృష్ణం రాజు ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత వాతావరణం మరింత వేడెక్కింది.

తమ ప్యానల్ ను గెలిపించుకోవడానికి పోటీలో వున్న ఆయా అధ్యక్ష అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ తమ ప్యానల్ సభ్యులను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రకాష్ రాజ్ మాత్రం తమ ప్యానల్ లో జయసుధ, శ్రీకాంత్, నాగినీడు, సాయికుమార్, ప్రగతి, బెనర్జీ, తనీష్, బ్రహ్మాజీ, రవి ప్రకాష్, అనసూయ, అనితా చౌదరి, అజయ్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శ్రీనివాసరెడ్డి, భూపాల్, సుధీర్, గోవిందరాజ్, శ్రీధర రావు, సురేష్ కొండేటి వున్నారని తెలిపారు.

ఇటీవల ప్రకాష్ రాజ్ చెన్నై లో ఓ తమిళ సినిమాలో గాయపడి , హైదరాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరాడు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భగా తన టీమ్‌ సభ్యులకు కబురు చేసి ఫిలింనగర్ లోని తమ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించింది . అనారోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. గతంలో ఆర్టిస్టుగా తనపై వచ్చిన ఆరోపణలను విచారించిన “మా” ప్రకాష్ రాజ్ కు ఎవరూ సహకరించవద్దని హుకుమ్ జారీచేసింది. తెలుగులో పరాయి నటులను ప్రోత్సహించవద్దని కోట శ్రీనివాసరావు లాంటి నటులు నిర్మాతలు, దర్శకులకు విజ్ఞప్తి చేశారు.

అయినా ప్రకాష్ రాజ్ లాంటి సమర్ధుడైన నటుడిని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఇన్నాళ్ల తరువాత మా అసోసియేషన్ కు అధ్యక్షుడు కావాలనే కలను సాకారం చేసుకోవడానికి చాలాకాలంగా ప్రకాష్ రాజ్ పక్కా ప్రణాళిక రచిస్తూ వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో ఆయన సూచనలతోనే ప్రస్తుత ప్యానల్ ఏర్పాటయింది . ఈ ప్యానల్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే టీవీ రంగంలో వున్న వారిని కూడా చేర్చుకున్నారు . కాబట్టి గెలుపు అవకాశాలు ప్రకాష్ రాజ్ కే ఎక్కువ వున్నాయి. ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు తాను ఏమి చెయ్యబోతున్నాడో ప్రకాష్ రాజ్ ప్రకటించే అవకాశం వుంది.

Related posts