ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఆందోళన నెలకొంది. ఎల్పీజీ బాట్లింగ్ కంపెనీ నుంచి గ్యాస్ ఫిల్ చేసుకుని వెళ్తున్న సమయంలో.. సమీపంలోనే ట్యాంకర్ పల్టీ కొట్టింది. బోల్తాపడిన ట్యాంకర్ లోంచి గ్యాస్ లీకయి ప్రమాదం సంబవించే అవకాశాలుండటంతో స్థానికులు, పరిసర కర్మాగారాల యాజమాన్యాలు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
పరవాడలో ఎల్పీజీ లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ ఎల్పీజీ బాట్లింగ్ కంపనీ వద్దే ప్రమాదానికి గురయ్యింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ప్రమాదం తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు. వేరే ఖాళీ టాంకర్ తీసుకొచ్చి ఆ గ్యాస్‌ను దానిలో నింపే చర్యలు చేపట్టారు.
భారీ క్రెయిన్ సాయంతో పల్టీ కొట్టిన ట్యాంకర్‌ను యథాస్థితికి తీసుకొచ్చారు. అయితే, ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకవడం మాత్రం ఆగడం లేదు. దీంతో అధికారులు దాన్ని ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాన్ని వెంటనే అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధమవుతున్నారు.