ఈ ఏడాది వర్షాలు భీభత్సంగా కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా పొంగి పొర్లుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి అక్టోబర్ 12న మధ్యాహ్నం తర్వాత ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఆది, సోమవారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.