ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కొత్త జిల్లాల పాలన మొదలైంది. ఇప్పటివరకు13 జిల్లాలు.. ఇక నుంచి 26 జిల్లాలుగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లా చాలా ముఖ్యమైనది. ప్రస్తుత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో విశాఖ జిల్లా విస్తీర్ణం మరింత తగ్గింది. జిల్లా నుంచి మైదాన ప్రాంతాన్ని వేరుచేసి అనకాపల్లి జిల్లాగా, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటుచేశారు. దట్టమైన అటవీ ప్రాంతం, కాఫీతోటలు, అంతర్జాతీయంగా పేరొందిన బొర్రాగుహలు, అరకు పర్యాటక ప్రాంతం, సీలేరు జలవిద్యుత్ కేంద్రం, అల్లూరి స్మారక మ్యూజియం అల్లూరి సీతారామరాజు జిల్లాపరిధిలోకి వెళ్లాయి.
ఆంగ్లేయుల పాలనలో దేశంలో ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా విశాఖపట్నం గుర్తింపు పొందింది. తూర్పుతీరంలో బ్రిటీష్ వారు విశాఖ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉత్తరాన బరంపురం వరకు ప్రాంతాన్ని విశాఖ జిల్లాగా గుర్తించారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పాలనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో 1802లో విశాఖ జిల్లా ఏర్పడింది.
కాగా 1803లో కలెక్టర్‌గా ఎల్‌జీకే ముర్రే అనే ఆంగ్లేయ అధికారి నియమితులైన తరువాత పరిపాలన ప్రారంభమైంది. అప్పటి జిల్లా విస్తీర్ణం 44,600 చదరపు కిలోమీటర్లు. అనేక వనరులు, ప్రకృతి సంపద, దట్టమైన తూర్పు కనుమలు, సముద్ర తీరంతో ఆర్థికంగా పటిష్టంగా ఉండేది. అంతటి చరిత్ర కలిగిన జిల్లా ఇప్పుడు నగరానికే పరిమితం అవుతోంది.