గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి 11 మంది కారులో పాలకొల్లు బయలుదేరారు. ఈ క్రమంలో చిలకలూరిపేట పట్టణంలో ఎన్ఆర్‌టీ సెంటర్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులోని ప్రయాణికుల్లో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, వారంతా పాలకొల్లుకు చెందినవారని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.