సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈడీల కమిటీ రూపొందించిన నివేదికపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఓ సమీక్షా సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక్క డిమాండ్ మినహాయించి కార్మికుల మిగతా డిమాండ్లను పరిష్కరిస్తే, ఆర్టీసీ సంస్థపై పడే ఆర్థిక భారం, సాధ్యాసాధ్యాలు ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నేటి ఉదయం 11 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉందని.. వారితో ఈడీ కమిటీ సభ్యులు చర్చలు జరిపే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. ఈడీల కమిటీ రూపొందించిన నివేదికల ఆధారంగా జరగబోయే చర్చలకు బస్ భవన్ కానీ లేదా ఆర్టీసీ కార్యాలయం వేదిక కాబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.