telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు విలన్ గా యంగ్ హీరో ?

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్‌కు 30వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా మంచు మనోజ్‌ను తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తోన్న రెండో సినిమా కావడంతో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. దీనిలో భాగంగా బలమైన విలన్ పాత్రకు మంచు మనోజ్ అయితే బాగుంటారని ఎన్టీఆర్ వద్ద త్రివిక్రమ్ ప్రస్తావించారట. ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపడంతో మనోజ్‌ను త్రివిక్రమ్ సంప్రదించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, మనోజ్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదని అంటున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్‌కు మంచు మనోజ్ విలన్ అనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ సినిమా వచ్చింది. ఇప్పుడు రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉంటాయి. మరోవైపు మంచు మనోజ్ చాలా కాలం తరవాత మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. ఎంఎం ఆర్ట్స్ పేరిట సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకున్న మనోజ్.. ఈ బ్యానర్‌లో మొదటి సినిమాగా ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Related posts