telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జర్నలిస్ట్ వీవీఆర్‌ కృష్ణంరాజును మూడు రోజుల తుళ్లూరు పోలీసు కస్టడీకి తరలింపు

రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన జర్నలిస్ట్ వీవీఆర్‌ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను ఇవాళ‌ అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ కేసుకు సంబంధించి కృష్ణంరాజును మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మంగళగిరి న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి 22వ తేదీ వరకు పోలీసులు ఆయన్ను విచారించనున్నారు. కస్టడీకి తీసుకునే ముందు కృష్ణంరాజును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (జీజీహెచ్‌) తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ఈ మూడు రోజుల విచారణలో అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఎవరైనా ఉన్నారా? ఎవరి ప్రోద్బలంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? అనే కోణంలో పోలీసులు ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని స‌మాచారం. ఈ వ్యాఖ్యలకు దారితీసిన పరిస్థితులు, ఇతర సంబంధిత అంశాలపై కూడా పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Related posts