telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

రేవంత్ తర్వాత నేను సీఎం అవ్వాలనుకుంటున్నా – జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

 తెలంగాణ సీఎం పదవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.

వచ్చే ఐదేళ్లు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 9ఏళ్ల తర్వాత సీఎం కావడానికి తాను ప్రయత్నం చేస్తానని తెలిపారు.

రేవంత్ సీఎంగా దిగిపోయాక తాను ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. ఆ క్రమంలో తన అప్లికేషన్ ప్రజల దగ్గర పెడుతానని చెప్పుకొచ్చారు. ఇవాళ గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు.

కవిత బీఆర్ఎస్‌లో ఉంటే ఏంటి.. బయటకి వస్తే ఏంటని ప్రశ్నించారు. ఆమె మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

తండ్రి వారసత్వం కొడుకుకే ఉంటుందని తెలిపారు. కొడుకు లేకపోతే కూతురికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.

తాము స్పందించే అంతటి లీడర్ కవిత కాదని తమ అభిప్రాయమని అన్నారు. కవిత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావడం లేదని చెప్పారు.

కేసీఆర్, రేవంత్‌రెడ్డి సమానమైన ప్రాధాన్యం ఉన్న నేతలని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఒకరిని మరొకరు విమర్శించుకుంటే అర్థముందని అన్నారు.

కవిత ఎందుకు అనవసరంగా తమ గురించి మాట్లాడుతుందని ప్రశ్నించారు. హాయిగా బతుకమ్మ ఆడుకోకుండా కవితకి ఎందుకు ఈ పంచాయితీ అని నిలదీశారు.

లిక్కర్ స్కాంలో పైసలు పెట్టడానికి కవితకి ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Related posts