telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రతి ఇంట పేదరికం పోవాలి, మన తలరాతలు మారాలి-జగన్

ఏపీ ప్ర‌భుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పారు  జగనన్న విద్యాదీవెన కింద మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఇంట పేదరికం పోవాలి, మన తలరాతలు మారాలన్న.. ప్రతివర్గం పెద్ద చదువులు చదువుకోవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్ మాట్లాడుతూ.. ఈ పథకం వల్ల అక్షరాల 11.03 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకాకూడదని.. నూటికి నూరుశాతం అక్షరాస్యత కానేకాదు, పిల్లలను వందశాతం గ్రాడ్యయేట్లగా నిలబెట్టాలన్నది మన లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉన్నత చదువులు అభ్యసిస్తేనే తల రాతలు మారుతాయి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామ‌ని అన్నారు

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నామన్న జగన్.. తమ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటే కాక, గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లతో కలిపి రూ.6259 కోట్లు చెల్లించిందని వెల్లడించారు.

ఇక, జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్‌ చదివేవాళ్లకి 15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదివేవారికి 20వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.. ఇప్పటి వరకు రూ.2267 కోట్ల రూపాయలు ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. మంచి మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నాం అన్నారు.. విద్యాదీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాలకు కలిపి ఈ రెండు ఏళ్లలో రూ.8500 కోట్లకుపైగా ఇచ్చామని వెల్లడించారు.

2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా మరో 10 డిగ్రీలు కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపిన ఏపీ సీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రూ.880 కోట్లతో నాడు – నేడుకు శ్రీకారం చుడుతున్నామని.. మరో రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తి అవుతాయని, కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు.

విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్డీయూ యూనివర్శిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీని తీసుకుని వస్తున్నాం.. కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీని తీసుకు వస్తున్నాం, కురుపాంలో ఇంజినీరింగ్‌ కాలేజీ, సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ, పాడేరులో మెడికల్‌ కాలేజీ తీసుకు వస్తున్నామని వెల్లడించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.

Related posts