ఆంధ్రప్రదేశ్ లో తమ కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. బుధవారం విశాఖపట్టణంలో మాయావతి పవన్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే విభజన డిమాండ్ మొదలైందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చేసి ఉంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పాలనలో కూడ ఒకే తరహా పరిస్థితి నెలకొందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని బీజేపీ అమలు చేయలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆమె విమర్శించారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రంలో తమ కూటమి అధికారాన్ని కైవసం చేసుకొంటుందని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ 2014లో అప్పటి పరిస్థితుల కారణంగా టీడీపీ, బీజేపీల కూటమికి తాను మద్దతిచినట్టు చెప్పారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తామని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందన్నారు. . ఏ కారణం చేత తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేకపోయారో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి మాయావతి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.