యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని అల్లుడిని దారుణంగా మట్టు బెట్టించాడు.
వివార్లాలోకి వెళితే..
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రామకృష్ణ (32) 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అప్పట్లో యాద గిరిగుట్టలోనే ఉంటూ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చి పోతుండేవాడు.
ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, వెంకటేశం కొద్ది రోజులకే వీరి ప్రేమ విషయం తెలుసుకుని రామకృష్ణను దూరం పెట్టాడు . రెండేళ్ల కిందట వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుని భువనగిరికి మకాం మార్చారు. వీరికి ఆరు నెలల పాప ఉంది.
ఇదే క్రమంలో 2019లో తుర్కపల్లిలో గుప్తనిధుల కేసులో రామకృష్ణను విధుల నుంచి తొలగించారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో రామకృష్ణను వెంకటేశమే గుప్తనిధుల కేసులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అప్పటి నుంచి రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
అయితే వీరి పెళ్లి నచ్చకపోవడంతో అల్లుడిపై కక్ష పెంచుకున్న వెంకటేష్ పెళ్లయిన కొత్తలోనే రామకృష్ణను మట్టుబెట్టేందుకు ప్రయత్నించాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు చెల్లించాడు.ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్నిగుండాల మండలం రామారం గ్రామానికి తీసుకెళ్లారు.
అక్కడ మరో తొమ్మిది మందితో కలిసి తాళ్లతో బంధించారు. అనంతరం రామకృష్ణ తలపై మేకులు కొట్టి దారుణంగా హింసించి అదే రోజు రాత్రి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి టాటాఏస్ వాహనంలో లతీఫ్ ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజాము వరకు శవాన్ని వాహనంలోనే ఉంచారు. తర్వాత కొండపాక మండలం లకుడారం గ్రామంలోని ఓ నీళ్లు లేని కాల్వలో పూడ్చిపెట్టారు.
రామకృష్ణ భార్య భార్గవి ఫిర్యాదు నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన భువనగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. రామకృష్ణ మామ వెంకటేష్ సూచనలతో లతీఫ్ అతని గ్యాంగ్ రామకృష్ణను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు.

