telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై అధిష్ఠానం దృష్టి

ఏపీలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఏపీలోని కొందరు సీనియర్ నేతలకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై రాహుల్, సోనియా చర్చించే అవకాశముంది. రాష్ట్ర నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చింతా మోహన్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఏఐసీసీ సెక్రటరీ గిడుగు రుద్రరాజును ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోరింది.

ఏపీ కొత్త పీసీసీ చీఫ్ నియామకంతో పాటు, ఏపీ నేతలకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఊమెన్ చాందీ, ఏఐసీసీ సెక్రటరీలు క్రిస్టోఫర్, మయప్పన్ కొన్ని సూచనలను ఇప్పటికే అధిష్ఠానానికి అందజేశారు.అవసరాన్ని బట్టి మరికొంతమంది ఏపి రాష్ట్ర నేతలను కూడా రాహుల్ గాంధీ విడిగా కలిసే అవకాశం ఉంది. ఈ కసరత్తు పూర్తయున తర్వాత సెప్టెంబర్లో కొంతమంది రాష్ట్ర నేతలకు పార్టీ పదవులు, బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ అధిష్ఠానం. త్వరలోనే రాహుల్ ఏపీలో పర్యటించే అవకాశం ఉంది.

Related posts