హైద్రాబాద్ లో నిన్న మరో పరువు హత్య చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్ అనే యువకుడిని అమ్మాయి తరఫు వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
చందానగర్ కు చెందిన హేమంత్, అవంతి రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయి జూన్ 11న లవ్ మ్యారేజి చేసుకున్నారు. ఈ పెళ్లి అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చనలకు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో హేమంత్ ను హత్య చేసేందుకు అవంతి మేనమామ యుగంధర్ రూ. 10 లక్షలకు కిరాయి హంతకులకు చెల్లించినట్టు దర్యాప్తులో తేలింది.
యుగేంధర్ రెడ్డి తన సోదరుడు విజయేందర్ రెడ్డితో కలిసి ప్లాన్ వేశాడు. హేమంత్, అవంతి ఉంటున్న గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. హేమంత్ ను, అవంతిని వారు బలవంతంగా ఓ కారులో ఎక్కించారు. తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిద్దరినీ మరోసారి కారులో ఎక్కించారు. కానీ అదే రోజు రాత్రి కారులోనే హేమంత్ ను దారుణంగా హతమార్చారు.