telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వాన..రైతులకు తీవ్ర నష్టం

rain hyderabad

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతుంటే.. మరో వైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు ప్రజలను, రైతులను వణికిస్తున్నాయి. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా గూడూరు సీతానాగారం శివారు రాళ్లవాగుదస్రుతండాలో మంగళవారం వడగళ్లవాన రైతులను అతలాకుతలం చేసింది. అకాలవర్షంతో అన్నదాతలు పంటను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు తీసినా లాభం లేకపోయింది. రోడ్ల వెంబడి ఎండబోసిన మిర్చి తడిసిపోగా పంట చేనుల్లో మొక్కజొన్నలు కొట్టుకుపోయాయి. కొన్ని తోటల్లో మిర్చి నేలరాలింది. గాలివాన బీభత్సానికి మర్రిమిట్ట, బ్రాహ్మణపల్లి, దామరవంచ, బొద్దుగొండ గ్రామాల్లోని మామిడికాయలు రాలిపడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా మబ్బులు పడుతుండటంతో మిర్చి రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం సాయంత్రం మహబూబాబాద్‌ మండలంలోని రెడ్యాల, కంబాలపల్లి, నడివాడ గ్రామాల్లో చిరు జల్లులు పడటంతో రైతులు పట్టాలు కప్పారు. బయ్యారం మండలంలోని కట్టుగూడెం, గంధంపల్లి, నామాలపాడు, సింగారం, కోటగడ్డ గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. మామిడితోటలకు తీరని నష్టం వాటిల్లింది. పలుచోట్ల స్తంభాలు విరిగిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏజెన్సీలో గాలివాన బీభత్సం సృష్టించింది. గూడూరు ఏజెన్సీ మండలంలో గాలివాన బీభత్సం తోపాటు వడగళ్ల వాన రైతాంగానికి అపార నష్టాన్ని కలిగించింది. మట్టెవాడ, సీతా నగర్, చిన్న ఎల్లాపూర్, భూపతి పేట, మచ్చర్ల, దామరవంచ, బొద్దుగొండ, కొల్లాపురం తదితర గ్రామాలలో కురిసిన వడగళ్ల వానతో మిర్చి, మొక్కజొన్న, వరి, రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది.

Related posts