telugu navyamedia
క్రీడలు వార్తలు

మన్కడింగ్ పై హర్షా భోగ్లే కీలక వ్యాఖ్యలు…

మరోసారి మన్కడింగ్ ఈ ఐపీఎల్‌లో చర్చకొచ్చింది. ఐపీఎల్ వంటి నాన్ ఐసీసీ టోర్నమెంట్లలో దీన్ని తప్పనిసరి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీన్ని లేవనెత్తిందెవరో కాదు..స్టార్ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఆయన ఈ డిమాండ్ లేవనెత్తారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి మన్కడింగ్ విధానాన్ని మాండేటరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన్కడింగ్ విధానం క్రికెట్ స్ఫూర్తితో ముడిపడి ఉండటాన్ని నాన్సెన్స్‌గా అభివర్ణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్ చేస్తోన్న సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో క్రీజ్‌ను వదిలి పెట్టి చాలా ముందుకు వచ్చిన సందర్భాన్ని ఆయన ఉటంకిస్తున్నారు. ముస్తాఫిజుర్ నో బాల్ సంధించిన సమయంలో డ్వేన్ బ్రావో..నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌ వైపు ఉన్న క్రీజ్‌‌ను వదిలి పెట్టి కనీసం ఓ యార్డ్ దూరం వచ్చేశాడు. అప్పుడతన్ని అవుట్ చేయడానికి బౌలర్‌కు చక్కని అవకాశం లభించిందని, నైతికతకు కట్టుబడి ఉండటం వల్లే ముస్తాఫిజుర్‌కు.. మన్కడింగ్ చేయాలనే ఆలోచన కూడా వచ్చి ఉండకపోవచ్చని హర్షాభోగ్లే పేర్కొన్నారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌ క్రీజ్‌ను అలా వదిలి పెట్టి ముందుకు రావడం సమంజసమేనా అని ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌‌ను ఆయన తన ట్వీట్‌కు జత చేశాడు.

Related posts