telugu navyamedia
రాజకీయ వార్తలు

‘మా భూమి ‘ నరసింగ రావుతో గద్దర్ అనుబంధం

ప్రజా కవిగా తెలుగు వారికి సుపరిచితులైన గద్దర్ తెలుగు సినిమా రంగంపై కూడా తన ముద్ర వేశారు . ఆయన పాడింది తక్కువ పాటలే కానీ ఆయన్ని చిరస్మరణీయంగా నిలిపాయని చెప్పవచ్చు .


నరసింగరావు గారు విద్యార్థి దశ నుంచి ప్రజా ఉద్యమాలతో పాల్గొనేవారు . ఆ ఉద్యమాలే ఊపిరిగా సాగుతున్న గద్దర్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెర పై ఆవిష్కరించాలని నరసింగ రావు , రవీంద్రనాథ్ భావించారు . గొప్ప సినిమా ‘మాభూమి ‘. ఇది గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా. బి.నరసింగ రావు , జి .రవీంద్రనాథ్ ఈ సినిమాను రూపొందించారు. కిషన్ చందర్ రచించిన ‘జబ్ ఖేత్ జాగే ‘ నవలను ఎంపిక చేసుకున్నారు . అప్పటికే డాక్యుమెంటరీలు తీసి సినిమా ప్రముఖులను ఆకట్టుకున్న బెంగాలీ గౌతమ్ ఘోస్ ను దర్శకుడుగా ఎంపిక చేసుకున్నారు . ఇది గౌతంకు దర్శకుడుగా తొలి సినిమా .

ప్రధాన పాత్రల్లో సాయి చంద్ ,భూపాల్ రెడ్డి , రామ్ రెడ్డి, బి , నరసింగ రావు, తెలంగాణ శకుంతల , ప్రదీప్ శక్తి ,కాకరాల , గద్దర్ మొదలైన వారితో పాటు తెలంగాణ ప్రజలు కూడా నటించారు . అది సినిమా షూటింగ్ లా కాదు ఒక ప్రజా ఉద్యమం లా సాగింది . బండి యాగగిరి రచించిన ‘బండెనక బండి కట్టి, పదహారు బళ్ళు కట్టి ఏ బండ్లో వస్తావు ..’ పాటను గద్దర్ పాడటమే కాదు ఇందులో నటించారు . ఈ పాట చిత్రీకరణ ప్రజ్ఞాపూర్ లో జరిగింది. ఈ పాట తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించింది.

‘సినిమా షూటింగ్ అంతా తెలంగాణ పల్లెల్లో జరిగింది . ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా హైదరాబాద్ శ్రీ సారథి స్టూడియోస్ లోనే జరిగింది . అప్పుడు నేను జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక రిపోర్టర్ గా ఆ సినిమా వార్తలు కవర్ చెయ్యడానికి వెళ్ళేవాడిని . అప్పుడు నరసింగ రావు గారు గద్దర్ ను నాకు పరిచయం చేశారు. అప్పటి నుంచి నరసింగ రావు , గద్దర్ అనుబంధం కొనసాగింది. మా భూమి సినిమా 23 జనవరి 1979లో విడుదలైంది. అదొక చరిత్ర. అందులో గద్దర్ పాడిన పాట అప్పడు ,ఇప్పుడూ ,ఎప్పుడూ సంచలనమే .
ఆ తరువాత నరసింగ రావు 1983లో ‘రంగుల కల ‘ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో గద్దర్ తో ‘జమ్ జమల్ మర్రీ వేయి కాళ్ళా జర్రీ ‘, ‘భద్రం కొడుకో జర పైలం కొడుకో ‘ రెండు పాటలను గానం చేశారు. ఈ పాటలు కూడా అత్యంత ప్రజాదరణ పొందాయి. నరసింగ రావు గారితో నా అనుబంధం కూడా కొనసాగింది . ఆయన సినిమాలకు పబ్లిసిటీ నేనే చూసేవాడిని . అప్పుడప్పుడు గద్దర్ నరసింగ రావు దగ్గరకు వచ్చేవాడు. అప్పుడు వారితో మాట్లాడే వాడిని .

జీవితమంతా ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన గద్దర్ తన ఉనికిని చాటుకొని మనకు జ్ఞాపకంగా తన పాటను వదలి వెళ్ళాడు .
– భగీరథ

Related posts