పవన్ కల్యాణ్ మాటలను పాకిస్థాన్ పత్రికలు వాడుకుంటున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి జాతీయ భద్రతను లాగొద్దని, రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని సూచించారు. అధికార దాహం కోసం జాతీయ భద్రతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయొద్దని జీవీఎల్ పేర్కొన్నారు. పీకే అంటే మనం పవన్ కల్యాణ్ అనుకుంటాం, కానీ పీకే అంటే జాతీయ స్థాయిలో పాకిస్థాన్ కోడ్ అనుకుంటున్నారని కొత్త భాష్యం చెప్పారు.
2016లోనూ మోదీ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉగ్రమూకల దుశ్చర్యలను భారత్ ఉపేక్షించదని ఈ దాడులతో స్పష్టం అయిందన్నారు. భారత్ వింగ్ కమాండర్ అభినందన్ ను పాక్ పట్టుకుంటే మోదీ ప్రభుత్వం రెండు రోజుల్లోగా విడుదల చేయించిందని తెలిపారు. అభినందన్ భారత బలగాల ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.