telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

నాడు గుంటూరు హోటల్స్ పెంకుటింట్లో నడిపేవారు!

 (గుంటూరు హోటల్స్ నిర్వహణ పై రవీంద్రనాథ్ ముక్కామల గారి  ప్రత్యేక కథనం) 

అప్పటి కాలంలో గుంటూరు హోటల్స్ ఒంటిగది పెంకు టింట్లో నడిపేవారు. అయినపట్టికీ రుచిలో మాత్రం రాజీపడేవారుకారు. హోటల్ స్థాయిని బట్టి ఒకటి రెండు పైసల తేడాలో టిఫిన్స్ ఉండేవి. పట్టణంలో సాయి విలాస్ ఒక్కగది పెంకుటింట్లో నడిచేది. రెండు ఇడ్లి 7 పైసలు మాత్రమే.. పచ్చడి కొంచెం పల్చన చేసే వాడు గానీ చాలా రుచిగా శుచిగా ఉండేది.

అరండల్ పేట 4వ లైను ఒకటో అడ్డ రోడ్డు మూలమీద చిన్న పెంకుటింట్లో లక్ష్మీ విలాస్ ఉండేది. హోటల్ ఓనర్ మునుస్వామి..వీధి గుమ్మంలో గల్లాపెట్టె దగ్గర దేవుడికి అగ్గరుబత్తి హారతి పడుతూ కనిపించేవాడు పొద్దున్న వంటగదిలోంచి సాంబార్ వాసన గుప్పుమంటూ రోడ్డుమీదకు కొడుతుండేది. సాయంకాలం లక్ష్మీ విలాస్ కిటకిటలాడుతూ ఉండేది. ఆ హోటల్ లో అరటి ఆకులో రెండిడ్లీలు కారప్పొడి వేసి ఆ రెంటి మీద సువాసనలు వెదజల్లే నెయ్యి పోసి కొబ్బరి పచ్చడి ఇచ్చేవాడు.gutur

మరో హోటల్ డాబా ఇంట్లో గీతా కేఫ్.. ఇందులో కూడా జనం కిటకిటలాడుతూ అన్ని రకాల టిఫిన్స్ లాగించేస్తారుగానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పూరీ.. ఒక్కో పూరీ సైజులో ప్లేట్ కి సరిపడా ఉండేది.. బూరల్లాగా ఉబ్బిన రెండు పూరీలు కింద పడిపోకుండా నాట్యమాడుతూ సర్వర్ తీసుకొస్తుంటే అందరూ అబ్బురంగా చూసేవాళ్లు. దానితో పాటు ఇచ్చే బంగాళాదుంప కూర చూడటానికి దుంప ఉల్లి పసుపేసి ముద్దకొట్టినట్టు ఉండేది.

మెయిన్ రోడ్ జంక్షన్ లో మరో హోటల్ శంకర విలాస్ ఉండేది. ఈ హోటల్ లో టిఫిన్స్ చాలా బావుంటాయని వేనోళ్ళ పొగడబడ్డ హోటల్.. గుంటూరు హోటల్స్ కి శంకర విలాస్ క్రికెట్ ఆటకి కపిల్ దేవ్ లాంటిది. భారత్ కి క్రికెట్ ఆటలో గెలుపు రుచి చూపించినవాడు కపిల్.. అదృష్టం మీద ఆధారపడకు, నిన్ను నువ్వు నమ్ముకో, కష్టపడి పనిచేయి, పోరాడితే విజయంనీదే అనే స్ఫూర్తిని కలిగించిన వాడు కపిల్.. బ్రిడ్జికి ఇవతల ఊరు విస్తరిస్తున్న రోజుల్లో ఒక పెంకుటింట్లో మొదలైంది శంకర విలాస్.. రుచికి శుచికి పెట్టింది పేరు.. కొద్దిరోజుల్లోనే శంకర విలాస్ టిఫిన్స్ కి మారు పెరైంది.

మునిసిపాలిటీవారితో నిమిత్తం లేకుండా ఆ కూడలి శంకర విలాస్ కూడలిగా మారింది. వ్యాపారాన్ని విస్తరించే దిశగా పెంకుటిని డాబా ఇల్లుగా మార్చేశారు.హోటల్ చాలా మంచి వ్యాపారం అనేంతగా ఎదిగిపోయింది శంకర విలాస్.. చుట్టుపక్కల కొత్త కొత్త హోటల్స్ పెట్టేరుగానీ శంకర విలాస్ కి దీటుగా నాణ్యత పాటించలేక పోయాయి. Sankara Vilas is trend setter like Kapil in cricket శంకర విలాస్ విస్తరించి విస్తరించి ఇప్పుడు మూడు నక్షత్రాల హోటల్ గా మారింది.

శంకర విలాస్ కి ఫర్లాంగ్ దూరంలో మెయిన్ రోడ్ మీద బ్రిడ్జి ఎదురుగా లక్ష్మి థియేటర్ పక్కన ఉన్నది ఆనంద భవన్. ఈ హోటల్ లో పెసరట్టుని.. అట్టుని మూడుభాగాలుగా విభజించి ఒక్కో భాగంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం అద్ది, కూసింత నెయ్యి తగిలించి దోరగా కాల్చేవాడు.. వేడివేడి అట్టు అల్లం పచ్చడితో లాగిస్తుండేవారు. అరిటాకు భోజనానికి ఆనంద భవన్ చాలా ప్రసిద్ధి గాంచింది.

బ్రిడ్జికి ఇవతలివైపు కాంతిలాల్ అనే రాజస్థానీ బలరాం హోటల్ నిర్వహించేవాడు.. ఇక్కడ ఉత్తరాది మిఠాయిలు, పూరి, చపాతీ మరియు చాయ్ మాత్రమే లభించేవి. సినిమాకి వెళ్లేవాళ్లు ఇక్కడ తప్పకుండా టీ త్రాగేవారు. సినిమా జనాన్ని తీసేస్తే మిగిలినవాళ్లు చపాతీ కోసం అర్రులు చాచేవారు.నిజానికి ఆ ఆరాటం చపాతీకోసం కాదు దానితోపాటు ఇచ్చే కుర్మా కోసం.. ఒక్క కుర్మాతోనే దశాబ్దాలుతరబడి వ్యాపారం నడిపాడు.

ఇక అరండల్ పేట 7వలైన్ మెయిన్ రోడ్ మీద స్వాగత్ హోటల్.. ఉల్లిదోసె తినాలంటే ఇక్కడే.. దోశలోపల సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనె నిండుగా ఉండేవి.దోశతో పాటు చింతపండు పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉండేవి. పచ్చడి మళ్లీమళ్లీ అడిగి వేయించుకునేవారు. ఉల్లిదోశకి మారుపేరు స్వాగత్ అంటే అతిశయోక్తికాదు.

ఇక అప్పట్లో మసాలాదోశ తినాలనిపిస్తే బ్రాడీపేట 4వ లైన్ 5వ అడ్డరోడ్డునున్న మైసూర్ కేఫ్ కి దారి తీయాల్సిందే.. జనార్దన్ అనే కన్నడం అతను ఈహోటల్ నడిపేవాడు. దేశ విఖ్యాత రవి ట్యుటోరియల్ కాలేజీ పక్కనే చోటు సంపాదించి ఏర్పాటు చేసిన ఈ హోటల్ లో కొంచెం కర్ణాటక పద్ధతిలో ఉండే టిఫిన్స్ చేశేవారు. మసాలా దోశ చట్నీ విడివిడిగా తింటే అంత గొప్పగాలేవే అనిపిస్తుంది. కఘుమఘుమలాడే కర్ణాటక కాఫీ మైసూర్ కేఫ్ మరో ప్రత్యేకత.

అయ్యా అదీ గుంటూరులో ఉన్న అనేక హోటల్స్ లో కొన్నిటి గురించిన ప్రహసనం ఇది.. ప్రతి హోటల్ కి ఒక ప్రత్యేకత ఉంది.. బ్రిడ్జి ఇవతలకి వచ్చి ఏ హోటల్లో జొరబడినా తృపి చెందుతారని హామీ ఇవ్వగలను.. అయితే పైన ఉదహరించిన హోటల్స్ లో ప్రస్తుతం మిగిలినవి మూడే.. శంకర విలాస్, గీతా కేఫ్ మరియు ఆనంద భవన్.. వీటిలో చివరిగా పెట్టిన గీతా కేఫ్ 50 వసంతాలు చూసింది.. మిగిలిన రెండు హోటల్స్ 60 ఏళ్లు దాటే ఉంటాయి,  

Related posts