గుంటూరు జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. మంగళగిరికి చెందిన కీలక నాయకుడు, టిడిపి అధికార ప్రతినిధి గంజి చిరంజీవి టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ బీసీల పార్టీ అని అందులో చేరాను..నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం. పార్టీ కోసం అహర్నిశలు పని చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.
సీటు ఇచ్చి సొంత పార్టీ నేతలే ఓడించారని ఆవేదన వ్యక్తం చేసారు. సొంత పార్టీలోనే కొందరు నేతలు తనను మానసికంగా హత్య చేసారని… బిసి నేతను కావడంవల్లే తనను రాజకీయంగా ఎదగనివ్వలేదని పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్మన్‌గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పదవుల కోసం రాజీనామా చేయలేదని.. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేకనే రాజీనామా చేశానని అన్నారు.
పార్టీని తాను మోసం చేస్తే.. తాను నమ్ముకున్న దేవుడు తనను నాశనం చేస్తాడన్నారు. టీడీపీ తనను మోసం చేస్తే అదే దేవుడు టీడీపీని నాశనం చేస్తారన్నారు. 2019 చివరి వరకు సీటు నీదే అని సీట్లు ఇవ్వకుండా తీవ్రంగా అవమానించారన్నారు.
మంగళగిరి టికెట్ ఇవ్వకపోవడంతో.. అధికార ప్రతినిధి పదవి ఇచ్చి నియోజకవర్గ ప్రజలకు దూరం చేశారని అన్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.