telugu navyamedia
సినిమా వార్తలు

స్నేహపాత్రుడు ఆర్.ఆర్.వెంకట్ ..

ఈరోజు హైద్రాబాద్ లో మరణించిన ఆర్ .ఆర్. వెంకట్ ( జె .వి .ఫణింద్ర రెడ్డి ) స్నేహపాత్రుడు. సినిమా అంటే ఎంతో అభిమానం . అయితే సినిమా ప్రచారానికి ఆయన దూరంగా ఉండేవారు. ఆయన మొదటి సినిమా “ది ఎండ్ “. రవి చావలి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అప్పటి రాష్ట్రపతి నుంచి ప్రశంసాపత్రం లభించింది .

2004లో ఎస్ .వి .కృష్ణా రెడ్డి దర్శకత్వంలో, కె . అచ్చి రెడ్డి సారథ్యంలో అలీ , వేణుమాధవ్ తో “హంగామా ” అనే చిత్రం నిర్మించారు . ఆ సినిమాకు పబ్లిసిటీ నన్ను చెయ్యమని అచ్చి రెడ్డి గారు అడిగారు. నేను అంగీకరించాను. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ లో జరిగేటప్పుడు నిర్మాత వెంకట్ గారు వచ్చారు. ఆయన్ని అచ్చి రెడ్డి గారు నాకు పరిచయం చేశారు.

ఆ తరువాత ఆయన నిర్మించిన “మాయాజాలం” , సినిమాకు కూడా నేను పనిచేశాను .
ఆయన కాంట్రాక్టర్ . ఎక్కువ రోజులు ఉత్తర భారతంలో ఉండేవారు . హైదరాబాద్ వస్తే మాత్రం కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి తో పాటు నన్ను కలిసేవారు. అప్పుడు ఆర్ .ఆర్ మూవీ మేకర్స్ కార్యాలయం గణపతి కాంప్లెక్స్ వెనుక ఉండేది. వెంకట్ గారి తరుపున వారి బంధువు సురేష్ రెడ్డి నిర్మాణపు పనులు చూసేవారు. సురేష్ రెడ్డి నేనంటే చాలా అభిమానంగా ఉండేవారు .

Telugu producer RR Venkat no more

ఒక రోజు సురేష్ రెడ్డి నాకు ఫోన్ చేసి “వెంకట్ సార్ వచ్చారు , మీరొకసారి మన ఆఫీసుకు రండి ” అన్నారు.
నేను వెళ్ళేటప్పటికి వెంకట్ గారు నన్ను తన రూమ్ లోకి తీసుకెళ్లారు .
“మీకు జగపతి బాబు గారు బాగా తెలుసనీ సురేష్ రెడ్డి చెప్పారు ”
“అవును సార్ , వాళ్ళ నాన్న గారు కూడా బాగా తెలుసు ” అన్నాను .
“అయితే మన నెక్స్ట్ సినిమాకు ఆయన్ని ఒప్పిస్తారా ? రవి దగ్గర మంచి కథ వుంది ” అన్నారు .
“ప్రయత్నం చేస్తా సార్ ” అన్నాను .

“మీరు ఒప్పిస్తే . ఆ సినిమాకు మీరే ఎగ్జిక్యూటివ్ నిర్మాత , అందుకు మీకు … లక్ష లిస్తా ” అన్నారు .
“… లక్షలా ? ” అన్నాను.
“అవును …. లక్షలు ” అని మళ్ళీ చెప్పారు .
అప్పటి వరకు సినిమాకు పబ్లిసిటీ చేస్తే 30 వేలు ఇచ్చేవారు . వెంకట్ గారు … లక్షలు అనగానే నాకు నిజంగా ఆశ్చర్యమేసింది , వూహించనంత ఆనందం కూడా కలిగింది. జగపతి బాబు నాకు చాలా సన్నిహితుడు . నేనంటే చాలా అభిమానం ..
వెంకట్ గారి దగ్గర నుంచే జగపతి బాబుకు ఫోన్ చేసి రేపు వస్తాను మీతో మాట్లాడాలి అన్నాను. పర్లేదు ఫోన్లో చెప్పండి అన్నారు. కాదు ఇంటికి వస్తాలే అని చెప్పాను. ఆయన సరే అన్నారు . .
అదేరోజు సాయంత్రం ఫిలిం నగర్ దేవాలయానికి వెళ్లి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ విషయం చెప్పాను. ఆయన చాలా సంతోష పడ్డారు .
“బాబుకు నేను కూడా చెబుతాను , మీకు మంచి అవకాశం వచ్చింది . అల్ ది బెస్ట్ ” అని రాజేంద్ర ప్రసాద్ గారు మనస్ఫూర్తిగా అన్నారు .

Noted producer RR Venkat no more

మరుసటి రోజు నేను జగపతి బాబు ఇంటికి వెళ్లి మాట్లాడాను . “వెంకట్ గారు మీకు మంచి ఆఫర్ ఇచ్చారు . మీ కోసం తప్పకుండా సినిమా చేస్తాను ” అని హామీ ఇచ్చారు. అలా జగపతి బాబు “సామాన్యుడు సినిమాలో నటించారు. వెంకట్ అన్న మాట ప్రకారం నాకు డబ్బులు ఇచ్చారు . . అలాంటి నిర్మాతను నేను చూడలేదు . సినిమా రంగంలో ఎక్కువమంది అవకాశవాదులు వుంటారు . అన్న మాట నిలబెట్టుకునే వారు తక్కువ . వెంకట్ నిజంగా జెంటిల్ మన్ . తనతో పాటు అందరూ బాగుండాలనే మంచి మనిషి .

ఆయన ప్రతి సినిమా విడుదల ముందు ఐదు లక్షల రూపాయలు , వృద్దులు , వికలాంగులు , అనాథ ఆశ్రమాలకు ఇచ్చేవారు . వాటిని కూడా నేను సురేష్ రెడ్డి స్వయంగా వెళ్లి అలాంటి సంస్థలను ఎంపిక చేసేవాళ్ళం. ఇలా ఆపన్నులకు సహాయపడే గొప్ప మనిషి.  వెంకట్ గారి కుటుంబం చాలా సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా నుంచి వరంగల్ కు వచ్చి స్థిరపడింది . ఆయన 57 సంవత్సరాలకే మరణించడం దురదృష్టకరం. వెంకట్ గారి అంత్యక్రియలు ఈరోజు 12. 00 గంటలకు మహాప్రస్థానంలో జరిగాయి. వారి ఏకైక కుమారుడు వివేక్ వర్ధన్ రెడ్డి తండ్రికి అంతిమ సంస్కారం నిర్వహించాడు.వెంకట్ కు చివరిసారిగా నివాళులు అర్పించాను .
ఆయన స్మృతి ఎప్పటికీ నాలో ఉంటుంది.
– భగీరథ 

Related posts