telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాతో సినిమా తీసే దమ్ముందా ?… క్రేజీ హీరో సవాల్

Karthik

బాలీవుడ్ కుర్ర హీరో కార్తిక్ ఆర్యన్ అతితక్కువ సమయంలోనే క్రేజీ హీరోగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కార్తిక్ ‘భూల్ భులయ్యా 2’, ‘దోస్తానా 2’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలకు సీక్వెల్స్. మరోపక్క దీపిక తాను నటించిన ‘ఛపాక్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ హీరో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్‌తో కలిసి నటించాలని ఆశపడుతున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. దీపిక నటించిన తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’లోని ఫొటోను, తాను ఆడిషన్ ఇచ్చినప్పుడు తీసిన ఫొటోను పక్క పక్కన పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘మా ఇద్దరితో సినిమా చేయడానికి ఏ దర్శకుడికైనా దమ్ము ఉందా?’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు దీపిక స్పందిస్తూ.. ‘కానీ ఆ పాత ఫొటోలు ఎందుకు పోస్ట్ చేశావ్’ అని ప్రశ్నించింది. ఇందుకు కార్తిక్.. ‘ఓం శాంతి ఓం’లోని డైలాగ్ కొడుతూ.. ‘ఎందుకంటే దేవుడు కూడా మనమిద్దరం నటించాలని అప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు’ అన్నాడు. ఇందుకు దీపిక కూడా ఇదే సినిమాలోని డైలాగ్ కొడుతూ.. ‘స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది’ అని పేర్కొంది. అలా కాసేపు దీపిక, కార్తిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా సంభాషించుకున్నారన్న మాట. వీరి సంభాషణ చూసి ఏ దర్శకుడైనా వీరితో సినిమా తీసేందుకు ముందుకు వస్తాడేమో చూడాల్సిందే.

Related posts