telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్ ది చిల్ల‌ర మనస్తత్వం -ఈటెల

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్ర‌చారం చేస్తుండ‌గా ఇటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్ర‌చారం చేస్తున్న‌ది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రామన్నపల్లిలో మాజీమంత్రి ఈటల రాజేందర్ రోడ్​షో నిర్వహించిన భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, యువకుల ఓట్లు కొందామని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మిగతా నియోజకవర్గాల్లో అలానే గెలిచి ఉంటారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ప్రజలు డబ్బు, మద్యానికి ఓట్లు వేయరని అన్నారు.

2018 ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి ఇస్తానంటూ సీఎం కేసీఆర్… ఓట్లు దండుకొని మోసం చేశారని ఆయన విమర్శించారు. ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్… ఇప్పుడు ఓటుకు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేద్దామనే దుష్ట ఆలోచనతో ఉన్నారని విమర్శించారు.

హుజూరాబాద్ ప్రజలు అవసరమైతే కేసీఆర్​కే డబ్బులు తో పాటు ఒక లిక్కర్ బాటిల్ కూడా కొని ఇస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు ఆయన అల్లుడు హరీశ్​రావుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

డబ్బులకు ఓట్లు వేస్తరనే చిల్లర మనస్తత్వం కేసీఆర్​ది. కొడంగల్, నారాయణఖేడ్, హుజూర్​నగర్, నాగార్జునసాగర్​లో గెలవచ్చు కానీ హుజూరాబాద్​లో గెలవలేవు. ఆకలినైనా భరిస్తాది ఈ గడ్డ కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోదు ఈ గడ్డ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Related posts