తెలంగాణలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పై సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సాయంత్రం ఐదు గంటలకు గేట్లు వేశాక పోలింగ్ బూత్ లో ఏదో జరిగిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గంట వ్యవధిలో ఆరు శాతం పోలింగ్ జరగడం, అదీ సమయం ముగియడంతో గేట్లు వేశాక జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై పరిశీలన జరపాలంటూ శుక్రవారం ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిని కలిసి తన సందేహాలను ఆయన వద్ద వ్యక్త పరిచారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గంలో 39 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందన్నారు. ఐదు గంటల సమయానికి ఇది 45 శాతానికి చేరి ఆశ్చర్యపరిచిందన్నారు. సాయంత్రం ఐదు గంటలకు గేట్లు మూసే సమయానికి కొందరు ఓటర్లు లోపలే ఉన్నారని, వీరంతా ఓట్లేశాకే పోలింగ్ పెరిగిందని తెలిపారు. ఈ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.