telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హింసా ప్రవృత్తి ని తగ్గించాలి..ఎన్కౌంటర్ చేస్తే.. అది పెరిగిపోతుంది..

encounters raise violence but not peace

మహిళలపై హింసాత్మక ఘటనలు జరగటానికి కారణాలలో ఇప్పటి పరిస్థితులలో పెరుగుతున్న హింసాత్మక ప్రవృత్తి ప్రధానమైనదని, ఎన్కౌంటర్ లు చేస్తే, ఆ ప్రభావం పెరిగి, నేరాలు పెరిగిపోయే అవకాశం ఉంటుందని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య అన్నారు. నేరస్తులు ఎవరైనా శిక్షించాలి. బాధితులు ఎవరైనా న్యాయం జరగాలని, అయితే చట్టాలను అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదని చెప్పారు. సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో మహిళా ట్రాన్స్‌జెండర్‌ ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ… గత రెండు దశాబ్దాలుగా మహిళలపై జరుగుతున్న హింసకు కారణాలను ప్రభుత్వానికి వివరిస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్‌ సీఎం అయ్యాక ఇప్పటివరకు మహిళా సంఘాలతో మాట్లాడలేదని, మీ పాలనలో మహిళలు ఉండరా.. మీకు మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు పట్టవా అని విమర్శించారు. ఎన్‌కౌంటర్‌తో చేతులు దులుపుకుంటే సరిపోదని, 108 తరహాలో మహిళలకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు.

భూమిక డైరెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ.. నేరం చేసిన వారిని న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా మధ్యలోనే చంపడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఎన్‌కౌంటర్‌ చేయగానే సంబరాలు చేసుకోవడం ప్రమాదకరమని, చావును సంబరాలు చేసుకోవడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇది ఉన్మాదానికి దారితీస్తుందని అన్నారు. తాము రేపిస్టులను సమర్ధించడంలేదని, కానీ ఈ సంఘటన వల్ల అత్యాచారాలు ఆగుతాయా అని ప్రశ్నించారు. ప్రముఖ రచయిత విమల మాట్లాడుతూ… మహిళలపై రోజురోజుకూ లైంగిక వేధింపులు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కొండవీటి సత్యవతి, జి.ఝాన్సీ, ఉషా సీతామహాలక్ష్మి, ఖలిదా ఫర్వీన్, మీరా సంఘమిత్ర, బండారు విజయ, శాంతి ప్రబోధ, సుజాత, అనురాధ, ఉషా, తేజస్విని, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్నప్పుడు వెంటనే స్పందించే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తేవాలని, అత్యవసర కాల్స్‌ను పర్యవేక్షించే వారే ప్రతిస్పందన చర్యలకు బాధ్యులుగా ఉండేలా చేయాలని, అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి, సైబర్‌ నేరాలను అరికట్టాలని తీర్మానించారు.

Related posts