telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 .. శ్రీకాంత్, సమీర్‌ వర్మ తొలి రౌండ్‌లోనే .. ఇంటిబాట..

indian players return in first round from japan open

భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, సమీర్‌ వర్మ జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21-13, 11-21, 20-22తో మనదేశానికే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ చేతిలో పోరాడి ఓడాడు. 59 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో తొలి సెట్‌ను సునాయాసంగా దక్కించుకున్న శ్రీకాంత్‌ రెండో సెట్‌ను అలాగే జారవిడుచు కున్నాడు. నిర్ణయాత్మక మూడోసెట్‌లో పోరాడినప్పటికీ కీలకదశలో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా- సిక్కిరెడ్డి ద్వయం 11-21, 14-21తో జెంగ్‌ సి వీ- హువాంగ్‌ యా క్వియాంగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి- చిరాగ్‌ షెట్టి ద్వయం 21-16, 21-17తో మార్కస్‌ ఎల్లిస్‌- క్రిస్‌ లాంగ్రిడ్జ్‌(ఇంగ్లండ్‌)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరింది.

పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో అలవోకగా రెండో రౌండ్‌లో ప్రవేశించింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సింధు 21-9, 21-17తో వరల్డ్‌ నెం.12 యూ హాన్‌(చైనా)పై గెలుపొందింది. తొలి సెట్‌ ఆరంభంలో 0-2తో వెనకబడిన సింధు ఆ తర్వాత వరుసగా 6 పాయింట్లు సాధించి 6-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే ఊపులో ప్రత్యర్థికి కేవలం మరో మూడు పాయింట్లు మాత్రమే కోల్పోయి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సింధుకు ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే అనుభవాన్ని రంగరించిన సింధు సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. తదుపరి రౌండ్‌లో అయ ఒహొరి(జపాన్‌)తో సింధు తలపడుతుంది.

Related posts