నిర్భయపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. చట్టపరంగా ఉన్న లొసుగులు ఉపయోగించుకుని.. ఇలా తప్పించుకోవాలని చూస్తుండటం దారుణమన్నారు. నిర్భయ దోషులకు ఇవాళ పడాల్సిన ఉరిశిక్ష అమలుపై శుక్రవారం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో.. సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అత్యాచార ఘటన కేసుల్లో.. దోషులకు ఆరు నెలల్లోనే శిక్ష అమలు అయ్యేలా చట్టాల్ని సవరించాల్సిన అవసరముందన్నారు. దీనిపై సత్వరమే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తూ.. ఢిల్లీలోని పాటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. ఇందుకు కారణం.. చట్టంలో ఉన్న లూప్ మాత్రమే. ఒకే కేసులో ఒకే శిక్ష పడిన దోషుల్లో.. ఏ ఒక్కరికి శిక్ష అమలు చేయడంలో వాయిదా పడ్డా.. అది మిగిలిన వారందరికీ వర్తిస్తుందని నిబంధనలు ఉండటంతోనే.. మిగతా ముగ్గురిని ఉరితీయాల్సి ఉన్నా.. నిలిచిపోయింది. అంతేకాకుండా.. క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన 14 రోజుల వరకు దోషుల్ని ఉరి తీయరాదంటూ.. సుప్రీ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దోషులకు శిక్షపడటం ఇప్పట్లో కాదని తేలిపోతోంది. ఉరిశిక్ష మరింత జాప్యం చేసేందుకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను దోషులు ఉపయోగించుకుంటున్నారు.