telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

రేపటి నుంచి దళిత బంధు… ఖాతాల్లోకి రూ10 లక్షలు

సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధమైన ప్రభుత్వం. ప్రయోగాత్మకంగా హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు. రేపటి నుంచే దళిత బంధు పథకం ప్రారంభం కానున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలను గుర్తించామని… తక్షణమే దళిత బంధు పథకం అమలు చేస్తామని.. రేపటి నుంచే మీ బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేస్తామంటూ వెల్లడించారు.

దళితులు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు అణిచివేతకు, వివక్షకు గురయ్యారన్న ఆయన.. దళితుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఇటీవల దళితబంధు పథకం తెచ్చిందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ పథకాన్ని విఫలం కానివ్వొద్దని కోరారు. మొదట మీ గ్రామంలోనే అమలు చేస్తున్నాం… ఇక్కడ విఫలం అయితే పథకం ఫెయిల్‌ అయినట్టు అవుతుందని… అందుకోసం ఆ మొత్తాన్ని ఆలోచించి ఖర్చు చేయాలన్నారు. పైసకు పైసా పెరుగుతూ పోవాలని తప్ప… చిన్నా చితక పనులకు ఖర్చు చేయొద్దన్నారు సీఎం కేసీఆర్‌. ఆ రూ.10 లక్షలు ఖర్చు చేయొద్దు.. వాటిపై సంపాదించింది మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. మరోవైపు.. దళితుల్లో ఐకమత్యం రావాలని పిలుపునిచ్చారు.. వాసాలమర్రి గ్రామస్తులు ఒప్పుకుంటే, పాడుబడిన పాత గ్రామాన్ని కూలగ్గొట్టి కొత్త వాసాలమర్రిని నిర్మించుకోవాలని అన్నారు.

Related posts