telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

16మంది ఇంటర్ విద్యార్థుల మృతిపై కోర్టు..

Panchayat Elections High Court Green Signal

ఇంటర్ మార్కుల మంటలు తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఓవైపు విద్యార్థులు తల్లిదండ్రులు, మరోవైపు విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఇంటర్ మార్కుల ప్రహసనంపై తీవ్ర ఆగ్రహావేశాలతో రోడ్డెక్కడంతో విషయం తీవ్రరూపం దాల్చింది. కాగా, ఈ వ్యవహారంపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కోర్టుకు హాజరయ్యారు. అంతకుముందు ఇంటర్ మార్కుల వ్యవహారంపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సోమవారం తదుపరి విచారణ ఉంటుందని పేర్కొంది.

16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ఇంటర్ బోర్డు ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని పిటిషనర్ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయవిచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై త్రిసభ్య కమిటీ వేశామని అదనపు ఏజీ రామచంద్రరావు వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా హైకోర్టు ఇంటర్ బోర్డు వ్యవహార సరళిపై అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, రీ వాల్యుయేషన్ పై నిర్ణయం తెలపాలని ఇంటర్ బోర్డును గట్టిగా హెచ్చరించింది. దీనికి అదనపు ఏజీ సమాధానమిస్తూ, రీవాల్యుయేషన్ పై సోమవారం వివరాలు వెల్లడిస్తామని, ఈ మార్కుల వ్యవహారం పరిష్కారానికి 2 నెలల సమయం కావాలని కోరారు. దాంతో న్యాయస్థానం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఫలితాల వెల్లడికి నెల రోజుల సమయం పట్టినప్పుడు, 3 లక్షల పేపర్ల ఫలితాలకు రెండు నెలల సమయం ఎందుకుని హైకోర్టు ప్రశ్నించింది.

Related posts