న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కివీస్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచులో ఓ హైడ్రామా చోటుచేసుకుంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి సరికొత్త కన్ఫ్యూజన్కు దారి తీసింది. మ్యాచ్ రిఫరీ సరికొత్త రూల్స్ విషయంలో తికమకపడి లక్ష్యాన్ని రెండుసార్లు మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20కి వర్షం అడ్డుపడింది. ఆ సమయానికి న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 173 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్‌కు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని విధించారు. అయితే మారిన డక్‌వర్త్ లూయిస్ పద్ధతిపై సరైన అవగాహన లేని బంగ్లా తాము ఛేజ్ చేయాల్సింది 16 ఓవర్లలో 148 పరుగులు అని భావించి బరిలోకి దిగింది. 1.3 ఓవర్ల తర్వాత గంధరగోళానికి లోనై మ్యాచ్ రిఫరీని సంప్రదించగా.. ఆయన మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. మ్యాచ్ తిరిగి ప్రారంభంమైన తర్వాత తొలుత బంగ్లాకు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన మ్యాచ్ రిఫరీ.. ఆతరువాత దాన్ని 16 ఓవర్లలో 171 పరుగులుగా మార్చాడు. దీంతో మ్యాచ్ మధ్యలో పెద్ద హైడ్రామానే నెలకొంది.

