తెలంగాణ రైజింగ్-2047పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకు అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అభివృద్ధి, పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ(సోమవారం) కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు అధికారులు.
ఫేజ్-1లో 25, ఫేజ్-2లో 40, ఫేజ్-3లో 46 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఫేజ్-1, ఫేజ్-2 లో ఇప్పటి వరకు 49 అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు అధికారులు.
ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్రెడ్డి.
జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని సూచించారు.
అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
కేంద్ర బడ్జెట్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు: యనమల