ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పరీక్షలకు హాజరవుతున్న డీఎస్సీ అభ్యర్థులకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు “AP DSC 2025 ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు!” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఇక, ఈ రోజు (జూన్ 6, 2025) ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 30 తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా డీఎస్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 137, ఇతర రాష్ట్రాల్లో 17 మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అధికారులు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు.
నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
అభ్యర్థులు సమయపాలన పాటించాలని, పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా అనుసరించాలని ఆయన సూచించారు.
కొంతమంది అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫోటోలు లేని కారణంగా, అలాంటి వారు తమ వెంట రెండు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తీసుకురావాలని అధికారులు తెలిపారు.
అలాగే హాల్ టికెట్లలో ఏవైనా తప్పులు ఉంటే, అభ్యర్థులు తమ వెంట ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.