telugu navyamedia
తెలంగాణ వార్తలు

చట్టసభల్లో న్యాయవాదుల ప్రాతినిధ్యం తగ్గింది..

చట్టసభల్లో న్యాయవాదుల ప్రాతినిధ్యం తగ్గిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ అభిప్రాయం వ్యక్తంచేశారు. వరంగల్ కోర్టుల సముదాయంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కోర్టుభవనాల సముదాయంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత కోర్టు సముదాయంలో భవనాలను, ఆర్ట్ గ్యాలరీలను ప్రారంభించారు.

దేశంలోనే వరంగల్ కోర్టు భవనాల సముదాయం వినూత్నంగా తీర్చి దిద్దారని అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ నవీన్ రావును ప్రత్యేకంగా అభినందించారు. న్యాయవాదులకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉందనీ, మేధావులని, న్యాయాన్ని కాపాడుతారనే భావన ప్రజల్లో ఉందనే విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు. నల్లకోటుకున్న గౌరవాన్ని గుర్తించాలని కోరారు, న్యాయవాదుల్లో పెరిగిన వ్యక్తిగత స్వార్థంవల్ల, సమాజం గురించి ఆలోచించలేదనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం: జస్టిస్‌ ఎన్వీ రమణ

సమాజాన్ని పట్టించుకుంటే… న్యాయవాదులు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగి, కొత్తచట్టాల రూపకల్పనలో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉంటుందనే భావన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులకేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టుల రూపురేఖలు మార్చేందుకు శీతాకాల సమావేశాల్లో కొత్త చట్టాన్ని తీసుకొస్తారనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

దేశానికే రోల్ మోడల్ వరంగల్ కోర్టు సముదాయం

వరంగల్ కోర్టు భవనాల సముదాయం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నవీన్ రావు తన ఆలోచనలకు అనుగుణంగా వరంగల్ కోర్టును తీర్చిదిద్దారని ప్రత్యేకంగా అభినందించారు. వరంగల్ చారిత్రకనేపథ్యం, కోర్టు భవనాల సముదాయం, ఇక్కడి మౌలికవసతులు, ఆర్ట్ గ్యాలరీ, ఫ్యామిలీ కోర్టు, ఛైల్డ్ కేర్ సెంటర్ తదితరాలతో పుస్తకరూపంలో ఇస్తే దేశంలో ఉంటే అన్ని కోర్టులకు పంపుతామన్నారు.

శిలాఫలకం ఆవిష్కరణ

వరంగల్ లో కోర్టు భవనాల సముదాయంలో ఫ్యామిలీకోర్టు, ఛైల్డ్ కేర్ సెంటర్ , జడ్జస్ లాంజ్ శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. చారిత్రక ఘట్టానికి సంకేతంగా నిలిచిన ఈ కార్యక్రమం పండుగవాతావరణాన్ని తలపించింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, వరంగల్ యూనిట్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ నవీన్ రావు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. కోర్టుల సముదాయాలను ప్రారంభించిన చీప్ జస్టిస్ ఎన్వీరమణ భవనాలను సదర్శంచి అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు.

Related posts