telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రైతులతో చెలగాటం వద్దు..

ఆంధ్రప్రదేశ్ లో అసమర్థ పాలన నడుస్తోందని తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగాకొనసాగించాలని అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన పాదయాత్ర ముగించిన తర్వాత తిరుపతిలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ఉద్యమకారులను ఉత్తేజపరచారు. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనలో జగన్ వ్యవహారశైలిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతి రాజధాని పై అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి చేసిన హామీలమాట తప్పారని గుర్తు చేశారు.

రాజధాని వికేంద్రీకరణ పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ జరగవనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటం భావితరాలకు స్ఫూర్తి దాయకం అని అన్నారు. జగన్ సర్కారు అన్నింటా ఫెయిల్ అయ్యిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ఆ ప్రాంత రైతులు న్యాయ పోరాటం సాగిస్తున్నారని, ఇది ఎంతో సమంజసమని ఆయన చెప్పారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట 45 రోజులుగా రైతులు పాదయాత్ర సాగించి, విజయవంతంగా పూర్తి చేశారని ఆయన ప్రశంసించారు.

రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతిలోనే ఉండాలని చంద్రబాబు చెప్పారు. అమరావతి తోనే రాష్ట్రం లోని అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అన్నారు. రాజధాని మూడు ప్రాంతాలలో పెడతాం అని మాయమాటలు చెబితే ఈ రాష్ట్రం నష్టపోతుందన్నారు. రాజధాని రైతుల పై ప్రభుత్వం అక్రమ కేసులు పెడితే ఊరుకోం అని హెచ్చరించారు. దళితులపైనే అట్రాసిటీ కేసుల్ని నమోదు చేయించిన దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజధాని విషయంలో జగన్ రెడ్డి తన పంట మార్చుకోకపోతే తీవ్ర పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. రైతులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని జగన్ సర్కారుకు సూచించారు.

Thumbnail image

అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు.. ఇలా అన్నీ అమరావతి రైతుల భూముల్లోనే ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావనకు తెచ్చారు. పైసా ఖర్చుచేయకుండా… అమరావతిని ప్రగతి పథంలో నడిపించవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. అమరావతిపై ఇప్పటికే పదివేలకోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేశామని, అన్ని ప్రాంతాలు ప్రగతి సాధించి, రాజధానిమాత్రం అమరావతిలోనే ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రులదేనని ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

Related posts