యూరియా సరఫరాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయశాఖ అధికారులకు నిర్దేశించారు.
ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని, అదే సమయంలో ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తుంటే.. అలాంటి వారిని గుర్తించి, తగిన సమాధానం చెప్పాలని సూచించారు.
అంతిమంగా ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చేసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఎరువుల లభ్యత, సరఫరాపై ఆదివారం సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరాపై ఆరా తీశారు. ఖరీఫ్ అవసరాలకు తగ్గట్లు ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
మార్క్‌ఫెడ్ ద్వారా ఎంత మేరకు ఎరువులను సరఫరా చేస్తున్నారని అధికారులను సీఎం అడిగారు. అనంతరం మాట్లాడుతూ ‘ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి, మార్క్‌ఫెడ్ ద్వారానే రైతులకు ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలి.
మార్క్‌ఫెడ్ ద్వారా 70శాతం ఎరువులు రైతులకు అందేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రానికి వచ్చే ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలి. యూరి యా, ఇతర ఎరువుల నిల్వలపై విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలి. యూరియాతో సహా అన్ని ఎరువుల నిల్వలనూ తనిఖీ చేయాలి.
వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడొద్దు. ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి.
ఎరువులను పక్కదారి పట్టించిన డీలర్ల లైసెన్సులను రద్దు చేయండి’ అని సీఎం ఆదేశించారు.
అలాగే, ఐఎంఎ్‌ఫఎస్ పోర్టల్‌లో ఏమేరకు సమాచారం అప్‌డేట్ అవుతోందని సీఎం ఆరా తీశారు.

