టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్వాకం కారణంగానే రాష్ట్రం భ్రష్టుపట్టిందనిన్నారు. జీతాలు ఇవ్వలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దయనీయంగా మార్చివేశారంటూ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులకు వైఎస్ హయాంలో న్యాయం జరిగిందని చెప్పారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల కోసం చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు బుర్ర పాడైనట్టు అనిపిస్తోందని, ఆయన బాలల దినోత్సవం నాడు దీక్ష చేస్తానని చెప్పడమే అందుకు నిదర్శనమని బొత్స వ్యంగ్యం ప్రదర్శించారు. అంతేకాకుండా, ఏపీ రాజధాని, ప్రాజెక్టులపై కమిటీ వేశామని, త్వరలోనే ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాజధానిపై వివరాలు చెబుతామని వెల్లడించారు. చంద్రబాబులాగా తొందరపడి ప్రజలను ఇబ్బంది పెట్టబోమని అన్నారు.