telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పలు కేంద్ర మంత్రుల తో భేటీ

కేంద్ర జల్‌ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పోలవరం నిధుల విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇవాళ (గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరానికి రూ.12 వేల కోట్లు కేటాయించగా  నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు.

అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైనా విజ్ఞప్తి చేశారు.

ఈ భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ రామ్ లీలా మైదానానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు.

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త, మంత్రులుగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు నేడు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీయే కీలక నేతలు హాజరవుతున్నారు.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.

ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 4: 45 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ తో నూ చంద్రబాబు సమావేశం అవుతారు.

మిర్చి ధర పతనం కావడంతో కష్టాలలో ఉన్న రైతులను ఆదుకునేందుకు సహాయం చేయాలని కేంద్రమంత్రిని కోరనున్నారు. దీనిపై కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి లేఖలు రాశారు.

అనంతరం సాయంత్రం 5:55 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరుతారు.

Related posts