కేంద్రం తక్షణమే ఆంధ్రాబ్యాంక్ విలీనాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించకుంటే నవంబరులో జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకుని చలో ఢిల్లీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. సిపిఐ, ఎఐటియుసి రాష్ట్ర సమితులు సంయుక్తంగా విజయవాడలోని ధర్నాచౌక్‌లో శనివారం ధర్నా నిర్వహించాయి. ఆంధ్రాబ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి రమణ అధ్యక్షతన జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే మోడీ ప్రభుత్వం బ్యాంకులను విలీనం చేస్తోందన్నారు. రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా ఏకమై కేంద్రంపై పోరాడితే ఆంధ్రాబ్యాంక్ తప్పక నిలబడుతుందన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేసే కుట్ర వెనుక కార్పోరేట్ శక్తులున్నాయని తెలిపారు. మూర్ఖత్వంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రాబ్యాంక్‌ను నిలబెట్టుకునేందుకు కంకణ బద్ధులు కావాలని కాంక్షించారు.
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను: ఎంపీ కోమటిరెడ్డి