మున్సిపల ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు ఊసర వెల్లి టైప్.. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్ధం కాదని..విజయవాడ-గుంటూరు అభివృద్ధికి గత ఐదేళ్లల్లో ఏం చేశారు..? అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఒకే సామాజిక వర్గానికి మేలు చేసే ప్రయత్నం చేశారు.. ఈ మాట మేమే కాదు.. టీడీపీ నేతలే అంటున్నారని హితువు పలికారు. ఓ సామాజిక వర్గం కోసం పాకులాడే ప్రయత్నం చేస్తే ఓట్లు ఎలా పడతాయని…చంద్రబాబు, లోకేష్ ఎన్నికల్లో ఎలా మాట్లాడారో చూశామని.. అబ్బా-కొడుకులు అసభ్య పదజాలంతో రాజకీయం చేశారని.. దానికి ఫలితం అనుభవిస్తున్నారని చురకలు అంటించారు. మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలుపొందిందని… ఒకట్రోండు చోట్ల టీడీపీకి ఎక్కువ స్థానాలు వచ్చినా.. ఎక్స్ ఆఫిషియో ఓట్లతో వాటిని దక్కించుకుంటామని మంత్రి బొత్స పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఓ చరిత్ర, అద్భుతమని.. సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అని తెలిపారు. చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఓటర్లు ఆదరిస్తారనే దానికి ఈ ఫలితాలే నిదర్శనమని… ఓటేయాలని కోరుతూ జగన్ ఒక్క సభ పెట్టలేదు.. మీటింగ్ నిర్వహించ లేదని తెలిపారు. ప్రజలకు కావాల్సింది చేస్తున్నప్పుడు.. మన వైపే ఉంటారని జగన్ నమ్మాడని పేర్కొన్నారు. ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది.. మేం ప్రజా సేవకు పునరంకితం అవుతామన్నారు. ఇంటి గుమ్మం ముందుకే ప్రభుత్వ పథకాలను అందిస్తోన్న ఘనత వైసీపీదేనని… క్యాలెండర్ అనౌన్స్ చేసి సంక్షేమం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీనేనని తెలిపారు. వైఎస్ హయాంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఆనాడు 90 శాతం సక్సెస్ సాధించామని.. ఆనాటికి అదే రికార్డ్ అని.. తండ్రిని మించిన తనయుడినని జగన్ నిరూపించుకున్నారని కొనియాడారు. నూటికి నూరు శాతం విజయం సాధించామని.. ప్రజలిచ్చిన ఈ విజయంతో మరింత బాధ్యతతో వ్యవహరిస్తామని తెలిపారు.