telugu navyamedia
తెలంగాణ వార్తలు

మంత్రి మల్లారెడ్డిపై దాడి: రేవంత్ రెడ్డి అనుచరులు సహా 16 మందిపై కేసులు నమోదు

ఘట్‌కేసర్‌లో జరిగిన ‘రెడ్ల సింహగర్జన సభ’లో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు ఇవాళ ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఈ ఘటనకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నేతలు మంత్రి మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

 దీంతో కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  రెడ్డి సభలోకి కొంతమంది దుండగులు ప్రవేశించారని.. వారే ఈ దాడికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో తెలిపారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు.  

వివరాల్లోకి వెళితే..

మేడ్చల్ జిల్లా జిల్లా ఘట్‌కేసర్‌లో రెడ్ల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సింహగర్జన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరు కాగా.. తీవ్రస్థాయిలో నిరసన ఎదురైంది. సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా కొంద‌రు అడ్డుకున్నారు.

దీంతో మంత్రి తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ దాడి చేశారు

Related posts