telugu navyamedia
విద్యా వార్తలు

సివిల్స్‌ 2021 ఫలితాల వెల్లడి : స‌త్తా చాటిన తెలుగుతేజాలు

*సివిల్స్‌ 2021 ఫలితాల వెల్లడి.. టాప్‌-3లో యువతులే..
*ఢిల్లీ యువతి శ్రుతిశర్మ టాపర్‌, అంకితా అగర్వాల్‌కు రెండో ర్యాంకు
*చండీగఢ్‌కు చెందిన గామిని సింగ్లాకు మూడో ర్యాంకు
* 685లో  ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 40 మంది తెలుగు వారు ఎంపిక

దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్‌ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర ఆలిండియా సర్వీస్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్‌–2021 తుది ఫలితాలను (ఇంటర్వ్యూ) యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) సోమవారం విడుదల చేసింది.

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్స్‌-2021 ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. వరుసగా తొలి మూడు స్థానాలూ వారే సొంతం చేసుకున్నారు.శ్రుతి శర్మ టాప్‌ ర్యాంకు కైవసం చేసుకోగా, రెండు, మూడు స్థానాల్లో అంకితా అగర్వాల్‌, గామినీ సింగ్లా నిలిచారు.తెలుగు అభ్యర్థులూ సివిల్స్‌లో సత్తా చాటారు

ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీసెస్‌లోని ఇతర శాఖలకు ఎంపికయ్యారు. సివిల్స్‌ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు.

తెలుగు తేజాలు వీరే

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌లో మరోసారి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మంచి ప్రతిభ చూపారు

ఏపీలోని నంద్యాలకు చెందిన యశ్వంత్‌రెడ్డి 15వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదే అత్యుత్తమ ర్యాంకు. హైదరాబాద్‌ యువతి సంజన సింహకు 37వ ర్యాంకు వచ్చింది. తెలంగాణలో ఈమెదే టాప్‌ ర్యాంకు.

కాగా, ఏపీలోని విశాఖకు చెందిన పూసపాటి సాహిత్యకు 24వ, నర్సీపట్నం వాసి అంత్రి మౌర్య భరద్వాజ్‌కు 28వ, భీమవరం యువతి శ్రీపూజకు 62వ, కాకినాడకు చెందిన కొప్పిశెట్టి కిరణ్మయికి 56వ ర్యాంకు, విజయవాడ యువకుడు గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంకు వచ్చాయి. చిత్తూరు జిల్లా నగిరి వాసి మాలెంపాటి నారాయణ అమిత్‌కు 70వ ర్యాంక్‌ లభించింది. అక్షయ్‌ పిళ్లై 51, తరుణ్‌ పట్నాయక్‌  (రాజమండ్రి) 99వ ర్యాంకు సొంతం చేసుకున్నారు.

కాగా, తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన ఆకునూరి నరే్‌షకు 117వ, నిజామాబాద్‌ యువతి అరుగుల స్నేహకు 136వ ర్యాంకులు లభించాయి. 

Related posts