telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరంపై .. కేంద్రం రెండు నాళికల ధోరణి..

Polavaram-Project

పోలవరం ప్రాజెక్టు విభజన చట్టం హామీలలో ఒక ముఖ్యమైన హామీ. కాని బిజెపి ప్రభుత్వం మొదటి నుండీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పరోక్షంగా ఏదో విధంగా అవరోధాలు కల్పిస్తూ, తన వంతు బాధ్యత నుండి తప్పుకునే వైఖరిని, బాధ్యతనంతా రాష్ట్రం మీదకే నెట్టివేసే వైఖరిని అవలంబిస్తోంది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు వ్యవసాయ ప్రధానమైన ఆంధ్ర ప్రదేశ్‌కు జీవనాడి. రాష్ట్ర విభజనను మొదటి నుండీ సమర్థించిన పార్టీ బిజెపి. విభజిస్తే రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా తోడుగా నిలుస్తుందని హామీలను ఇచ్చింది ఆ పార్టీ నేతలే. ప్రత్యేక హోదా అయిదేళ్లు ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌ అంటే, మేము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని బిజెపి చెప్పింది. ఆ తరువాత ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసింది. పోలవరం ను జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని ఎ.పి రీ ఆర్గనైజేషన్‌ యాక్టులో స్పష్టంగా పేర్కొంటే ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ వరకే కేంద్రం బాధ్యత అని మడత పేచీ పెట్టడం బిజెపి తెంపరితనాన్ని తెలియజేస్తుంది.

ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ కింద 2014 ఏప్రిల్‌1 నాటి అంచనా ప్రకారం రూ. 7,168 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 5,364 కోట్లు ఇచ్చామని, ఆ మొత్తానికి ఆడిటింగ్‌ రిపోర్టు పంపితే మిగతా బ్యాలెన్స్‌ను విడుదలజేస్తామని చెప్పడం పోలవరం నిర్వాసితులతో క్రూర పరిహాసమాడడమే. పోలవరం అంశాన్ని తొలుత ప్రస్తావించిందీ బిజెపియే. కాని విభజన అనంతరం పూర్తిగా ఫిరాయించి తనదేమీ బాధ్యత లేనట్టు వ్యవహరిస్తున్నదీ బిజెపియే. తాజాగా పార్లమెంటు సాక్షిగా పోలవరం పునరావాసానికి కేంద్రం బాధ్యత ఏమీ లేదని కేంద్ర జల వనరుల మంత్రి ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణం వేరు, నిర్వాసితుల పునరావాసం వేరు అన్న వైఖరిని తీసుకోవడం పూర్తిగా అనుచితం. ఏ నీటి పారుదల ప్రాజెక్టుకైనా జనావాసాలు ముంపునకు గురికావడం సాధారణం. ఆ ప్రజలకు పునరావాసం కల్పించడం ప్రాజెక్టులో అంతర్భాగమే. నిజానికి పునరావాస పనులు పూర్తి చేశాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలి. సుప్రీంకోర్టు తీర్పులు సైతం దీనిని ధృవీకరించాయి. దీనికి భిన్నంగా కేంద్రమంత్రి ప్రకటించడం అంటే రాష్ట్రానికి మరో మారు ద్రోహం చేయడమే.

ఉభయ గోదావరి జిల్లాల్లో 371 గ్రామాల్లోని సుమారు 1,05,601 కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్నాయి. వీరంతా నిరుపేదలు, అత్యధికులు గిరిజనులు. 15 శాతం దళితులు, ఇతరులు వెనుకబడిన తరగతుల కుటుంబాలవారు. వీరి జీవనాధారం అటవీ ఫలసాయం, వ్యవసాయం. ఆ గ్రామాల నుండి బైటకు నెట్టేస్తే ఎలా బతకాలో తెలియని వారు. వీరందరికీ సక్రమంగా పునరావాసం కల్పించాలంటే సవరించిన అంచనా వ్యయం ప్రకారం సుమారు 33 వేల కోట్లు అవసరం. ఇది ఎవరి దయాధర్మ భిక్ష కాదు. కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పించుకోనివ్వరాదు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది బిజెపి ప్రభుత్వమే. అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడడం అవకాశవాదం కాదా? విభజన చట్టం నిర్దేశించిన బాధ్యత నుండి తప్పించుకోజూస్తున్న బిజెపి ప్రభుత్వపు కుయుక్తుల్ని సాగనివ్వరాదు. జగన్‌ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించాలి. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలి. పోలవరం రిజర్వాయర్‌ లోకి నీరు ప్రవేశించక ముందే నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాలి.

Related posts