మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటై ఎనిమిది రోజులైనా ఇప్పటివరకు స్వతంత్ర అభ్యర్థులకు మంత్రిత్వ శాఖలు కేటాయించలేదని బీజేపీ చేసిన విమర్శలపై శివసేన ఘాటుగా స్పందించింది. ఈ మేరకు తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో బీజేపీపై విరుచుకుపడింది. తన బాధ్యతలేంటో ప్రభుత్వానికి తెలుసని, ఒకరు చెప్పాల్సిన పనిలేదని మండిపడింది. రాష్ట్ర వ్యవహారాలను ఎలా నిర్వహించాలో తమకు అవగాహన ఉందని పేర్కొంది.
పార్టీ నేతలకు మంత్రి పదవులు మాత్రమే లేవని, తలలు కాదని ఘాటుగా బదులిచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని తెలిపింది. శాఖల కేటాయింపును పూర్తిచేస్తామని, ప్రభుత్వాన్ని కలిసికట్టుగా నడిపిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో అనవసర విమర్శలు సరికాదని హితవు పలికింది. తమది 80 రోజుల ప్రభుత్వం కాదని, ఐదేళ్లపాటు సుదీర్ఘ పాలన అందించే ప్రభుత్వమని శివసేన స్పష్టం చేసింది.